జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతితో ఖాళీ అయిన సీటు కోసం అప్పుడే సీనియర్ కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ కర్చీఫ్ వేసేశారు. అక్కడి నుంచి తానే పోటీ చేయబోతున్నానని చెప్పుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకుంటానని చెప్పారు. ఈసారి ఆ సీటు గెలుచుకొని రాహుల్ గాంధీకి బహుమానంగా అందిస్తానని చెప్పారు.
దీని గురించి విలేఖరులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ని ప్రశ్నించగా, “ఎన్నికలలో ఆ సీటు మాకేనని పోటీ చేస్తామని చెప్పుకోవడం తప్పు కాదు. అజహరుద్దీన్ కూడా అలాగే చెప్పుకున్నారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పార్టీ నిర్ణయం కాదు.
ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత అనేక వడపోతలు జరుగుతాయి. అప్పుడే మా కాంగ్రెస్ అధిష్టానం సరైన అభ్యర్ధిని ఖరారు చేసి ప్రకటిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా అలాగే జరుగుతుంది,” అని చెప్పారు.