కొండా మురళిపై వేటు వేయాల్సిందే: వరంగల్‌ కాంగ్రెస్‌ నేతలు

వరంగల్‌ కాంగ్రెస్ పార్టీలో కొండా మురళి, సురేఖ దంపతులు ఇద్దరూ ఒకవైపు, జిల్లా కాంగ్రెస్‌ నేతలందరూ మరోవైపు అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ, “కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి వంటి వాళ్ళు గతంలో టీడీపీని నాశనం చేశారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు. పరకాలలో ఓ ముసలాయన ఉన్నారు. గత ఎన్నికలలో వచ్చి నా కాళ్ళు పట్టుకొని ఈ ఒక్కసారికి నాకు సీటు ఇస్తే వచ్చేసారి మీకే వదిలేస్తానని బ్రతిమలాడుకున్నారు. ఇలాంటి నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని దెబ్బ తీస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పరకాలలో మా కుమార్తె సుష్మిత కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తుంది. ఆమెని గెలిపించుకోవడానికి ఖర్చుకి వెనకాడం,” అని అన్నారు. 

కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలపై వరంగల్‌ కాంగ్రెస్‌ నేతలందరూ నాయిని రాజేందర్ రెడ్డి కార్యాలయంలో సమావేశమయ్యారు. దీనిలో కడియం, రేవూరి, గండ్ర, బసవరాజు, సుధారాజు, నాగరాజు తదితరులు హాజరయ్యారు. కొండ మురళి చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిరువురూ వరంగల్‌లో కుల రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారు. ఇంతకాలం వారిని చాలా భరించాము. ఇక భరించలేము. త్వరలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్‌లను కలిసి కొండా దంపతులపై పిర్యాదు చేస్తామని చెప్పారు.

ఈ వ్యవహరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన వెంటనే ఇద్దరు పరిశీలకులని వరంగల్‌ పంపారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.