జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సీటు కోసం అప్పుడే కాంగ్రెస్ పార్టీలో పోటీ మొదలైంది.
గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన, మహ్మద్ అజారుద్దీన్, బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలలో నేను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశాను. కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాను. కనుక ఈసారి ఉప ఎన్నికలో మళ్ళీ నేనే పోటీ చేసి తప్పకుండా విజయం సాధిస్తాను.
ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నేను ఎంతగానో కృషి చేస్తున్నాను. కనుక సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురి సహకారంతో నేను మా అధిష్టానాన్ని ఒప్పించి జూబ్లీహిల్స్ టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తాను.
సోనియా, రాహుల్, ఖర్గేల ఆశీసులతో ఈసారి తప్పకుండా గెలుస్తాను. గెలిచి ఈ సీటుని రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తాను,” అని మహ్మద్ అజారుద్దీన్ అన్నారు.