సముద్రంలో కలిసే నీటి కోసం గొడవలు అవసరమా?

తెలంగాణలో అధికార, విపక్షాలు ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. “ఎగువన తెలంగాణలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నా నేను ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఆ నీళ్ళు ఎవరో ఒకరు వాడుకోకుంటే వృధాగా సముద్రంలో కలిసిపోతాయి. 

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా నేను అందుకే అభ్యంతరం చెప్పలేదు. నేటికీ అదే మాటకి కట్టుబడి ఉన్నాను. ఎగువనున్న తెలంగాణలో దిగువన ఉన్న ఆంధ్రాలో ఎవరి శక్తిమేర వారు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకొని సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళని సద్వినియోగం చేసుకుందాము. 

బనకచర్ల ప్రాజెక్ట్ కూడా అటువంటిదే. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని రాయలసీమకు మళ్ళించుకొని అక్కడి ప్రజలకు తాగు,సాగు నీరు అందించాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఎగువన ఉన్న తెలంగాణకు దీనిపై అభ్యంతరాలు దేనికి? 

ఒకవేళ ఏమైనా ఉంటే ముఖ్యమంత్రులు ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకుందాము. మనలో మనం కొట్లాడుకుంటే నీళ్ళు సముద్రంలో కలుస్తూంటాయి తప్ప ఎవరికి ప్రయోజనం? కృష్ణలో నీళ్ళు తక్కువ కనుక వాటిపై ట్రిబ్యునల్ ఎలా చెపితే అలా చేద్దాము,” అని అన్నారు.