ప్రధాని గారు..భ్రమలలో బ్రతకొద్దు!

నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కారణంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కనుక ఆ నిర్ణయం వలన ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు దీని గురించి ఏమనుకొంటున్నారో తెలుసుకోవడం కోసం కేంద్రప్రభుత్వం ప్రధాని పేరిట ‘మోడీ యాప్’ ఒకటి లాంచ్ చేసి దాని ద్వారా సర్వే నిర్వహించింది. ఊహించినట్లుగానే దానిలో 90 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. కనుక నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని కేంద్రప్రభుత్వం గట్టిగా సమర్ధించుకొంటోంది. 

అయితే ‘షాట్ గన్’ అనే పేరున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మరియు భాజపా ఎంపి శత్రుఘన్ సిన్హా ప్రధాని నరేంద్ర మోడీకి ఊహించని షాక్ ఇచ్చారు. “మోడీజీ...మీరు ఇటువంటి సర్వేలు నిర్వహించుకొని భ్రమలలో బ్రతకాలనుకోవద్దు. అది పిచ్చోళ్ళ స్వర్గం వంటిదే. దానిలో విహరించడం వలన నష్టమే తప్ప లాభం ఉండదు. దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులని చూడండి..వాటిని పరిష్కరించండి. మీకు అనుకూలంగా సర్వేలు, కట్టుకధలు నిర్వహించడం మానుకోండి,” అని హితవు పలికారు. 

భాజపాలో నరేంద్ర మోడీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నావారిలో శత్రుఘన్ సిన్హా కూడా ఒకరు. ఆ వ్యతిరేకత నేటికీ కొనసాగిస్తునే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు భాజపా నేతలు అందరూ మోడీ నిర్ణయం గురించి తమ మనసులో మాట బయట పెట్టలేక సతమతమవుతుంటే, శత్రుఘన్ సిన్హా ధైర్యంగా మోడీని హెచ్చరించారు. కానీ ఆయన చేసే ఇటువంటి విమర్శలని, హెచ్చరికలని భాజపా ఏనాడూ పట్టించుకోలేదు. కనుక ఇప్పుడూ పట్టించుకోకపోవచ్చు.