ఎఫ్-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం విచారణకు హాజరైనప్పుడు, గతంలో ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.
ఈ అంశంపై కేటీఆర్ తన న్యాయవాదులని సంప్రదించగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ కేసుకు సంబందించి పూర్తి సమాచారం ప్రభుత్వ రికార్డుల ద్వారా ఏసీబీ తీసుకుంది.
ఎఫ్-1 రేసింగ్ వ్యవహారం గత ప్రభుత్వం నిర్వహించినప్పుడు మంత్రి హోదాలో కేటీఆర్ దానిని పర్యవేక్షించారు తప్పితే వ్యక్తిగతంగా దాంతో ఆయనకు ఎటువంటి సంబందం లేదు. కనుక ఆయన వ్యక్తిగత ఫోన్లను, ల్యాప్‌టాప్‌ని ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఓ కేసులో నిందితుడి నుంచి ఇటువంటి సాక్ష్యాధారాలు సేకరించి మళ్ళీ వాటిని అతనికి వ్యతిరేకంగా ఉపయోగించడం సరికాదని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి. కనుక ఈ కేసులో కేటీఆర్‌ని నిందితుడుగా పేర్కొంటున్నప్పుడు, ఆయన ఫోన్లు, ల్యాప్‌టాప్ అడగడానికి ఏసీబీకి ఎటువంటి అధికారమూ లేదు,” అని న్యాయవాదులు కేటీఆర్‌కి సూచించారు.
ఇది వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా పేర్కొనబడిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కూడా ఆమె వాడిన మొబైల్ ఫోన్లని తమకు అప్పజెప్పాలని ఈడీ ఆదేశించింది. మొదట ఆమె నిరాకరించినప్పటికీ తర్వాత స్వయంగా అప్పగించారు. కనుక ఈ కేసులో కూడా చివరికి అదే జరుగుతుందా? త్వరలో తెలుస్తుంది.