మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పియర్స్ క్రుంగిపోయినందుకు నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన 38 మంది ఇంజనీర్లకు ప్రభుత్వం షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోవడానికి మీరందరూ బాధ్యులని తేలింది. కనుక మీపై క్రిమినల్ లేదా శాఖాపరమైన చర్యలు ఎందుకు చేపట్టరాడో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని, సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోబడుతుందని ఆ నోటీసులలో పేర్కొంది.
నోటీసులు ఎవరెవరికంటే.. మాజీ ఈఎన్‌సీ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్‌సీవెంకటేశ్వర్లు, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎస్ఈ, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి, మేడిగడ్డ ఈఈ తిరుపతి రావు, పదవీ విరమణ చేసిన ఈఈలు ఉన్నారు. వీరు కాక ప్రస్తుతం క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ టీమ్, స్టాండింగ్ కమిటీలో డైరెక్టర్స్ ఆఫ్ వర్క్స్ విభాగాలలో ఏఈఈ, డీఈఈలకు ఈ నోటీసులు వెళ్ళాయి.
ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లను కూడా ప్రశ్నించి విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్దం అవుతుండగా, ప్రభుత్వం అప్పుడే ఇంతమంది అధికారులపై చర్యలకు సిద్దమవుతోంది.