కేంద్రప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంపై దేశంలో చాల మంది మాట్లాడారు. రకరకాల అభిప్రాయలు వ్యక్తం చేశారు. కానీ గొప్ప ఆర్ధికవేత్త, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ నేటి వరకు దాని గురించి తన అభిప్రాయం చెప్పనే లేదు. ఈ రోజు మొదటిసారిగా రాజ్యసభలో దాని గురించి వివరంగా మాట్లాడారు. నల్లధనం నివారణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ మంచి నిర్ణయాలే తీసుకొంటున్నప్పటికీ, దానిని ఆచరణలో ఎదురవుతున్న సమస్యలని ఊహించి తగు జాగ్రత్తలు తీసుకోవడంలో చాలా ఘోరంగా విఫలం అయ్యారని అన్నారు. పెద్దనోట్ల రద్దుతోనే దేశంలో నల్లధనన్ని అరికట్టడం సాధ్యం కాదని అన్నారు.
కేంద్రప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన గ్రామాలలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రప్రభుత్వం రోజుకొక నిర్ణయం ప్రకటిస్తున్నందున ప్రధాని కార్యాలయం, ఆర్ధిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతోందని డా. మన్మోహన్ సింగ్ అభిప్రాయ పడ్డారు. ఈ సమస్యలని అధిగామించడానికి కేంద్రప్రభుత్వం అడిగిన 50 రోజుల సమయం చాలా తక్కువే అయినప్పటికీ, ఆలోగానే దేశంలో సామాన్య ప్రజలు, అనేక వ్యవస్థలు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తొందన్నారు. ఈ ప్రపంచంలో ప్రజలు బ్యాంకులలో దాచుకొన్న డబ్బుని తీసుకోవద్దని చెపుతున్న ఏకైక దేశం భారతదేశమేనని డా. మన్మోహన్ సింగ్ విమర్శించారు. కనుక కేంద్రప్రభుత్వం తక్షణమే యుద్ద ప్రాతిపదికన నష్టనివరణ చర్యలు చేపట్టాలని డా. మన్మోహన్ సింగ్ సూచించారు.