రేసింగ్ కేసులో కేటీఆర్‌కి మళ్ళీ నోటీస్

ఎఫ్-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఏసీబీ మళ్ళీ నోటీస్ జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అ నోటీసులో పేర్కొన్నారు.

ఈ కేసులో జనవరి 9న ఒకసారి ఏసీబీ అధికారులు ఆయనని ప్రశ్నించారు. మళ్ళీ మే నెలాఖరున ఓసారి నోటీస్ ఇవ్వగా, తాను విదేశాల నుంచి తిరిగి రాగానే విచారణకు హాజరవుతానని చెప్పారు. కనుక సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీస్ పంపారు.

"ఇదో లొట్టిపీసు కేసు.. దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోమని" కేటీఆర్‌ అప్పుడే సవాలు విసిరారు. అప్పుడు కాంగ్రెస్‌ మంత్రులే దసరా, దీపావళి ముహూర్తాలు ప్రకటించి, చివరికి కేంద్రం అడ్డుపడుతోందంటూ సిఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఏ కేసులో బిఆర్ఎస్ పార్టీ నేతలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టమైంది. కనుక ఏసీబీ నోటీస్ చూసి కేటీఆర్‌ ఆందోళన చెందుతారని అనుకోనవసరం లేదు.