రేవంత్ మళ్ళీ ఢిల్లీకి ఈసారి దేనికంటే..

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. ఈసారి దేనికంటే మొన్న ఆదివారం ప్రమాణ స్వీకారాలు చేసిన ముగ్గురు మంత్రులకు ఏయే శాఖలు కేటాయించాలనే దానిపై చర్చించేందుకని సమాచారం.

అలాగే మంత్రివర్గ విస్తరణ తర్వాత పదవులు దక్కని నేతల అలకలు, అసంతృప్తి స్వరాల గురించి కూడా కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. మంత్రివర్గంలో కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి కూడా ఉంది.

కనుక వారి శాఖలలో కొన్ని మార్పులు చేర్పుల గురించి కూడా కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించినట్లయితే, సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ తిరిగిరాగానే మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం కూడా ఉంది. 

సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీలతో సమావేశమయ్యి ఈ అంశాలపై చర్చిస్తున్నారు. 

దేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వమే మొట్టమొదటగా ఎస్సీ వర్గీకరణ, కులగణన చేసి వాటి ప్రకారం రిజర్వేషన్స్ అమలుచేసింది. ఆ స్పూర్తితోనే కేంద్రం కూడా ఈసారి జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయాలని నిర్ణయించింది. ఇది తెలంగాణ కాంగ్రెస్‌ సాధించిన విజయమని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

కనుక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, బీసీ వర్గీకరణ, రిజర్వేషన్స్ అంశాలపై బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటున్నారు. వాటికి ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.