31.jpg)
ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరవడంపై కేంద్రమంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభాకర్ రావు విచారణకు హాజరైనప్పుడు ఏం మాట్లాడాలో కేసీఆర్ తరపున ఆయనకు ముందుగానే అమెరికాలో ఉండగానే కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాతే ఆయన హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్ ఆదేశం మేరకే ఆయన నాతో సహా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపి నేతల ఫోన్లు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు.
కనుక కనీసం ఈ కేసు విషయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కు అవకుండా సిట్ విచారణలో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఏం చెప్పారో ప్రభుత్వం వెల్లడించాలి. కేసీఆర్ నిర్వాకాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో కేసీఆర్ అండ్ కో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడం, సిట్, కమీషన్లు అంటూ కాలక్షేపం చేస్తోందే తప్ప ఇంతవరకు ఒక్కరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయలేదు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన లేదంటే ఇకనైనా ఈ కేసు విచారణ వేగవంతం చేసి దోషులకు శిక్షలు పడేలా చేయాలి,” అని బండి సంజయ్ అన్నారు.