
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 పదవులలో 3 మాత్రమే భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్లో ముగ్గురు కాంగ్రెస్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
గడ్డం వివేక్ (ఎస్సీ), అడ్లూరి లక్ష్మన్ కుమార్ (ఎస్టీ), వి శ్రీహరి ముదిరాజ్ (బీసీ) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రు నాయక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈరోజు ప్రమాణ స్వీకారాలు జరుగబోతున్నప్పటికీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ల నుంచి చివరి నిమిషంలో ఒత్తిళ్ళు మొదలవుతాయని లేదా మంత్రి వర్గ విస్తరణకు ముందే వారు మీడియా ముందుకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశ్యంతో మంత్రుల పేర్లు ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
కానీ ఈ ముగ్గురికీ మంత్రి పదవులు ఖరారు చేస్తే తప్పకుండా సీనియర్లు భగ్గుమంటారు. రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి వంటివారు పార్టీకి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని ముందే హెచ్చరించారు కనుక కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలయ్యే అవకాశం ఉంది. మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.