రేపే మంత్రివర్గ విస్తరణ కానీ..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరయ్యింది. కానీ ఇంతవరకు ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు భర్తీ చేయకపోవడంతో పదవులు ఆశిస్తున్నవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత రెండు మూడు నెలలు నుంచి మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ జరగలేదు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు (ఆదివారం) మంత్రివర్గ విస్తరణ జరుగబోతున్నట్లు సమాచారం. కానీ ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే సామాజిక వర్గాల ప్రకారం కొంతమంది పేర్లు ఖరారు చేసినందున వారిలో నుంచే ముగ్గురు లేదా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.

రేపు మంత్రుల ప్రమాణస్వీకారాల గురించి సంబందిత అధికారులు గవర్నర్‌ జిష్ణుదేవ్ శర్మకు ముందుగా తెలియజేసి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.  

మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అద్దంకి దయాకర్ రావు, విజయశాంతి, ఇంకో అరడజను మంది ఉన్నారు.

మంత్రి కొండా సురేఖ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో చిక్కుకొని ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నారు కనుక ఆమెని మంత్రి పదవి నుంచి తప్పించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.