గంధమల్ల జలాశయం పనులకు నేడే శంకుస్థాపన

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో ప్రధానంగా తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలో గంధమల్ల జలాశయం ఒకటి. ఆలేరు నియోజకవర్గం పరిధిలో ఈ జలాశయం విస్తరణ చేపడితే జిల్లాలో మరో 50-60 వేల ఎకరాలకు తాగుసాగు నీరు లభింస్తుంది. 

అయితే స్థానిక రైతులు జలాశయం కొరకు తమ భూములు ఇచ్చేందుకు సిద్దంగానే ఉన్నామని కానీ భూమికి భూమి లేదా మార్కెట్‌లో రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమలో ఎకరం, అరెకరం ఉన్న సన్నకారు రైతులే ఎక్కువ మంది ఉన్నారని, జలాశయం కోసం తమ భూములు తీసుకొని తమని అన్యాయం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

ఇదివరకు కేసీఆర్‌ ప్రభుత్వం గంధమల్ల జలాశయాన్ని 9.36 టిఎంసీల సామర్ధ్యంతో నిర్మించాలని భూసేకరణ ప్రారంభించింది. కానీ భారీగా భూసేకరణ చేయాల్సి వస్తుండటం ముంపు గ్రామాల ప్రజల అభ్యంతరాల దృష్టిలో ఉంచుకొని 4.28 టిఎంసీలకు కుదించింది. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కారణంగా గంధమల్ల జలాశయాన్ని 1.41 టిఎంసీలకు కుదించింది.   

జలాశయం శంకుస్థాపన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి తిరుమలాపూర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. సిఎం      జిల్లా పర్యటనకు వస్తున్నందున రాచకొండ కమీషనర్‌ భారీగా పోలీసులను మోహరించి భద్రతా ఏర్పాట్లు చేయిస్తున్నారు. తిరుమలాపూర్‌లో బహిరంగ సభ జరుగబోతున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రజ్ఞాపూర్-భువనగిరి మద్య వాహనాల రాకపోకలను భువనగిరి ఓఆర్‌ర్‌ మీదుగా మళ్ళించనున్నారు.