నవజ్యోత్ సిద్దూ ఫౌల్ ప్లే!

మాజీ క్రికెటర్, మాజీ ఎంపి నవజ్యోత్ సింగ్ సిద్దు భాజపా నుంచి బయటకి వచ్చి ఆవాజ్-ఎ-పంజాబ్ అనే స్వంత కుంపటి పెట్టుకొన్నప్పుడు చాలా సంచలనం సృష్టించాడు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఆయనే చక్రం తిప్పబోతున్నాడని అందరూ ఊహించారు. కానీ పార్టీ పెట్టుకొన్న ఒకటి రెండు నెలల్లోనే సిద్దూకి అంత సీన్ లేదనే సంగతి బయటపడింది. దానితో తనది రాజకీయ పార్టీ కాదని కూటమి అని ప్రకటించాడు. తరువాత తను ఏ ఆమాద్మీ పార్టీనయితే విమర్శించాడో మళ్ళీ దానితోనే బేరసారాలు చేశాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో కూడా బేరసారాలు సాగించాడు. చివరికి కాంగ్రెస్ పార్టీతో బేరం కుదుర్చుకోవడంతో దానిలో జేరేందుకు సిద్దం అవుతున్నాడు. మొదట తన భార్య నవజ్యోత్ కౌర్ ని ఈనెల 28న కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నాడు. ఆ తరువాత అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని సమాచారం. తనకి ఉపముఖ్యమంత్రి పదవి, తన భార్యకి, కొందరు ముఖ్య అనుచరులకి ఎమ్మెల్యే  టికెట్లు ఇవ్వాలనే షరతుకి కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం దానిలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. 

తన పంజాబ్ రాష్ట్రానికి, ప్రజలకి దూరంగా ఉండాలని భాజపా అధిష్టానం తనపై ఒత్తిడి చేసినందునే తను ఆ పార్టీని వీడానని సిద్దు చెప్పుకొన్నాడు. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి కోసమే సిద్దూ పార్టీని వీడాడని స్పష్టం అవుతోందిప్పుడు. సిద్దూ తన భార్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ముందుగా ఆమెని మాత్రమే చేర్పించడం గమనిస్తే ఇప్పటికీ సిద్దూ ఆమాద్మీ పార్టీతో బేరసారాలు కొనసాగిస్తూనే ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది. దేశంలో ఒక సగటు రాజకీయ నాయకుడి కంటే కూడా సిద్దూ చవుకబారుగా వ్యవహరిస్తుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.