భారత్లో జనాభా లెక్కలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో 2026, అక్టోబర్ 1 నుంచి జనాభా లెక్కల సర్వే జరిపించాలని నిర్ణయించారు. ముందుగా మంచు ప్రభావం ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో జనాభా లెక్కల సర్వే ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించింది.
2027, మార్చి 1వ తేదీ నుంచి రెండో దశలో మిగిలిన అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కల ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు. దీంతో బాటే కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దీని కోసం ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలను సంప్రదించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఈ ప్రక్రియ మొదలుపెడతారు. జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేపడుతున్నందున దేశంలో అన్ని రాజకీయ పారీల సహాయ సహకారాలు కూడా అవసరమవుతాయి. కనుక పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశంలో దీని గురించి చర్చించే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికలు 2029లో జరుగవలసి ఉంది. కనుక ఆలోగా ఈ ప్రక్రియ ముగిస్తే, జనాభా ప్రాతిపదికన శాసనసభ, లోక్సభ నియోజకవర్గాలను కూడా పునర్విభజన చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది.