తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపి, బిఆర్ఎస్ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. గాంధీ భవన్‌లోలో మీడియాతో మాట్లాడుతూ, “ఆ రెండు పార్టీల మద్య రహస్య బంధం ఉందని మేము (కాంగ్రెస్) ఎప్పటి నుంచో చెపుతూనే ఉన్నాము. ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా అదే చెప్తున్నారు కదా? 2023 శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తొలగించింది కూడా అందుకే. ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచేందుకే బండి సంజయ్‌ని ఆ పదవిలో నుంచి తొలగించి తోడ్పడింది. ఈ విషయం తెలంగాణ బీజేపి, బిఆర్ఎస్ పార్టీలో అందరికీ తెలుసు.
కాళేశ్వరం కేసులో నోటీసులు అందగానే హరీష్ రావు బీజేపి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి షామీర్ పేటలో ఓ ఫామ్‌హౌస్‌కు వెళ్ళారు. అక్కడి నుంచి వారిద్దరూ కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇంతకీ ఈటల రాజేందర్ బీజేపిలో ఉన్నారా లేక బిఆర్ఎస్ పార్టీలోకి మారబోతున్నారా?లేకుంటే హరీష్ రావుతో కలిసి కేసీఆర్‌తో ఫోన్లో ఎందుకు మాట్లాడారో చెప్పాలి,” అని అన్నారు.
ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ గురించి గొప్పలు చెప్పుకోవడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, అప్పట్లో ఇందిరా గాంధీ హయంలో వందల కొద్దీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. కానీ ఏనాడూ ఆమె వాటి గురించి ఇలా గొప్పలు చెప్పుకోలేదు.
భారత్-పాక్ యుద్ధంలో ఆమె చూపించిన తెగువకి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కూడా మెచ్చుకున్నారు కదా? భారత్-పాక్ మద్య యుద్ధం జరుగుతున్నప్పుడు మద్యలో ట్రంప్ జోక్యం చేసుకోగానే ప్రధాని మోడీ ఎందుకు వెనక్కు తగ్గారు? ఇంతకీ ఆపరేషన్ సింధూర్‌తో మోడీ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పగలదా?” అంటూ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.