సిఎం కేసీఆర్ గృహాప్రవేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెల్లవారు జామున 5.22 గంటలకి కొత్తగా నిర్మించిన తన అధికారిక నివాసంలోకి గృహాప్రవేశం చేశారు. ఆ భవనానికి ‘ప్రగతి భవన్’ అని నామకరణం చేశారు. చిన్న జియ్యర్ స్వామి దగ్గరుండి ఈ గ్రుహాప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ నూతన భవనంలో అత్యాధునికమైన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ముఖ్యమంత్రి నేరుగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 500 మందితో సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించిన సమావేశ మందిరానికి జనహిత అని పేరు పెట్టారు. మూడు బ్లాకులుగా నిర్మించిన ఈ భవనంలో సి.ఎం.ఓ. కార్యాలయం, అందులో అధికారులకి వేర్వేరుగా చాంబర్లు ఏర్పాటు చేశారు. ఇదివరకు ముఖ్యమంత్రి ఉపయోగించిన క్యాంప్ కార్యాలయంలో ఆయన భద్రతాధికారుల కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ లోని టాయిలెట్లకి బులెట్ ప్రూఫ్ అద్దాలు బిగించారు. ఆవరణలో పచ్చదనం కోసం ముఖ్యమంత్రి స్వయంగా ఎంపిక చేసిన మొక్కలు నాటారు. నేటి నుంచి ముఖ్యమంత్రి అక్కడి నుంచే తన పరిపాలనా కార్యక్రమాలు సాగిస్తారు.