పవన్ కళ్యాణ్‌ సినిమా… వారికి మాత్రమే!

పవన్ కళ్యాణ్‌ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన ఏపీ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూడు సినిమాలలో ఒక్కటీ ఇంతవరకు విడుదల కాలేదు. అతికష్టం మీదా హరిహర వీరమల్లుకి సమయం కేటాయించడంతో ఆ సినిమా జూన్ 12న విడుదల కాబోతోంది. మిగిలిన రెండూ ఎప్పుడో ఎవరికీ తెలీదు. 

 కానీ పవన్ కళ్యాణ్‌ని వెండి తెరపై చూసుకోవాలనే అభిమానుల ముచ్చట ఈరోజు తీర్చేశారు. 

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని  రావివలస గ్రామస్థులతో పవన్ కళ్యాణ్‌ సచివాలయంలో తన కార్యాలయం నుండి నేరుగా వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దీని కోసం జనసేన పార్టీ టెక్కలి పట్టణంలో ఓ సినిమా థియేటర్‌ అద్దెకు తీసుకుంది.

థియేటర్లో తెరపై కనబడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో వారు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్దతిలో తమ సమస్యల గురించి చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్‌ వాటిని నోట్ చేసుకొని అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మారుమూల గ్రామాలలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని పవన్ కళ్యాణ్‌ ‘మాట-మంతి’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.