బిఆర్ఎస్ రంగంలో దిగింది.. దూది పింజల్లా ఎగిరిపోతాయా?

జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇవ్వడంపై బిఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన కేసీఆర్‌కి నోటీస్ ఇవ్వడం చాలా తప్పని వాదిస్తున్నారు. 

యావత్ ప్రపంచ దేశాలు కాళేశ్వరం ప్రాజెక్టు ఓ మహాద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని పొగుడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం అదో పనికిమాలిన ప్రాజెక్ట్ అన్నట్లు మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఈ 15 నెలల్లో రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక తన వైఫ్యల్యాలను, తన అసమర్ధతని కప్పి పుచ్చుకునేందుకే కమిటీలు, కమీషన్లు పేరుతో ప్రజల దృష్టి మళ్ళించేందుకే ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే ఆయనపైనే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం బురద జల్లుతోంది. 

కానీ తెలంగాణకు మేలు చేసిన కేసీఆర్‌ని ఎవరూ ఏమీ చేయలేరు. కాంగ్రెస్‌ మంత్రులే (కొండా సురేఖ) మా మంత్రులు పైసలు ఇవ్వకపోతే ఏ పని చేయరని చెపుతున్నారు కదా?కనుక కమిటీలు వేస్తే ముందుగా కాంగ్రెస్‌ మంత్రుల కమీషన్లపై వేయాలి.

 ఈ కమిటీలు, కమీషన్లు అన్నీ దూది పింజల్లా కొట్టుకుపోతాయి. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే కమీషన్ల ప్రభుత్వమనే విషయం ప్రజలకు అర్దమవుతోంది,” అని అన్నారు.