నోట్ల కేసులన్నీ ఒకేసారి పరిష్కారం!

పాతనోట్లు రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశ వ్యాప్తంగా కొన్ని హైకోర్టులలో దిగువ కోర్టులలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నిటిపై స్టే విధించాలని కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ చేసిన అభ్యర్ధనని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కానీ ఆ పిటిషన్లని అన్నిటినీ కలిపి ఒకేసారి డిశంబర్ 2వ తేదీన విచారిస్తామని చెప్పింది. నోట్ల రద్దు నిర్ణయం జరిగి ఇప్పటికి రెండు వారాలు గడుస్తున్నా దేశంలో ఇంకా సామాన్య ప్రజలకి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తునందుకు, సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ సమస్యని అధిగమించడానికి  కేంద్రప్రభుత్వం తీసుకొన్న పలుచర్యలని ముకుల్ రోహాత్గీ సుప్రీం కోర్టుకి వివరించారు. పాత నోట్లని రద్దు చేసిన తరువాత 10వ తేదీ నుంచి బ్యాంకులు కొత్త నోట్లని ప్రజలకి అందించడం మొదలుపెట్టాయని చెప్పారు. నోట్లు ముద్రణలో ఎటువంటి ఆలస్యమూ జరగడం లేదని, దానిని బ్యాంకులు, పోష్టాఫీసులకి చేర్చడంలోనే ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ఈ సమస్యలని అధిగమించడానికి కేంద్రప్రభుత్వం వీలైనంత త్వరగా కొత్త నోట్లని అన్ని రాష్ట్రాలకి పంపిస్తోందని చెప్పారు. నిన్న అర్దరాత్రి వరకు మొత్తం రూ.6లక్షల కోట్లు విలువ గల పాత నోట్లు బ్యాంకులలో జమా అయ్యాయని, నోట్ల మార్పిడి ద్వారానే రూ.15 లక్షల కోట్లు విలువగల కొత్త నోట్లు ప్రజలకి చేరాయని ముకుల్ రోహాత్గీ సుప్రీంకోర్టుకి తెలిపారు.