ఇంతకాలం హైడ్రా అంటే అక్రమ కట్టడాలను కూల్చివేసే సంస్థగానే పేరు సంపాదించుకుంది. కానీ చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యత కూడా మాదేనని హైడ్రా కమీషనర్ రంగనాధ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. దానిలో భాగంగా వందలాది అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్థులతో అనేక గేటడ్ కమ్యూనిటీల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భారీగా నిర్మాణ వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. వాటన్నిటినీ సమీపంలో చెరువులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో పోస్తుంటారు. ఇంతకాలం ఇది సాగిందేమో కానీ ఇకపై సాగదని హైడ్రా కమీషనర్ రంగనాధ్ స్పష్టం చేశారు.
ఇకపై బిల్డర్లు కానీ భవన నిర్మాణ వ్యర్ధాలను తరలించే వాహన యజమానులు గానీ చెరువులు, ప్రభుత్వ స్థలాలలో వ్యర్ధాలు పోస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వ్యర్ధాలను తరలించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చేశాము వారు ఎక్కడ పోస్తారో మాకు సంబంధం లేదని బిల్డర్లు తప్పించుకుంటామంటే కుదరదని చెప్పారు.
వ్యర్ధాలను పోస్తున్న ట్రాన్స్‌పోర్టు యజమాని, డ్రైవర్‌తో పాటు, ఆ వ్యర్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుగొని ఆ బిల్డర్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రంగనాధ్ హెచ్చరించారు.
దీని కోసం చెరువులు, ప్రభుత్వ స్థలాల వద్ద నిఘా పెట్టామని రంగనాధ్ తెలిపారు. నిర్మాణ వ్యర్ధాలను ఎవరైనా ఎక్కడైనా పోస్తున్నట్లయితే స్థానిక ప్రజలు, యువత, విద్యార్ధులు, మహిళలు ఎవరైనా సరే హైడ్రా ఫోన్ నంబర్ 9000 113667కు పిర్యాదు చేయవచ్చని తెలిపారు.
వాట్సప్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ద్వారా కూడా పిర్యాదులు చేయవచ్చని, సాక్ష్యాధారాల కోసం వ్యర్ధాలు పోస్తున్న టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు, జేసీబీలు, వాటి డ్రైవర్ల ఫోటోలు, వీడియోలు తీసి పంపించాలని కమీషనర్ రంగనాధ్ కోరారు.
చెరువులు, ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలను కూల్చివేసి చేతులు దులుపుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. వాటిని కాపాడుకోవాలసిన అవసరం కూడా ఉంది. అప్పుడే హైడ్రా ఏర్పాటుకి సార్ధకత ఏర్పడుతుంది. ఈ విషయంలో హైడ్రా కమీషనర్ రంగనాధ్ నిర్ణయం చాలా మందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు కానీ ఇది సరైన నిర్ణయమే. చాలా అవసరమే.