ఏపీలో కూడా మహాలక్ష్మి పధకం!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పధకం హామీని అమలుచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏపీ ఎన్నికలలో టీడీపీ కూడా ఇటువంటి హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయినా ఇంత వరకు ఈ హామీ అమలు చేయలేదు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశారంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. 

దాని విమర్శలకు భయపడో లేదా అన్ని ఏర్పాట్లు పూర్తయినందునో ఆగస్ట్ 15 నుంచి ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత  ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆ రాష్ట్ర సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకటించారు. తెలంగాణలో మహాలక్ష్మి పధకం వలన టిజిఎస్ ఆర్టీసీ సంస్థపై, దాని ఉద్యోగులపై ఆర్ధికం భారం, పని భారం పడుతోంది. టిజిఎస్ ఆర్టీసీ కోల్పోతున్న ఆ ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం నెలనెలా చెల్లిస్తామని మాట ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో ఎప్పటికప్పుడు చెల్లించేలేకపోతోంది. 

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ, ఉద్యోగులకు ఇటువంటి కష్టాలే మొదలవబోతున్నాయి.