ఫైల్స్ క్లియర్ చేసేందుకు డబ్బులు తీసుకుంటారు: కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖా మళ్ళీ నోరు జారి  తమ ప్రభుత్వాన్ని చిక్కులో పడేశారు.

అరబిందో ఫార్మా కంపెనీ సామాజిక బాధ్యతగా (కార్పొరేట్ రెస్పాన్స్‌బిలిటీ) రూ.4.5 కోట్లతో వరంగల్‌, కృష్ణా కాలనీలో బాలికల జూనియర్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చింది. 

ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “కొన్ని ఫైల్స్ మంత్రులు వద్దకు క్లియరెన్స్ కోసం వస్తుంటాయి. అటువంటప్పుడు మంత్రులు ఆయా సంస్థల నుంచి డబ్బు తీసుకొని వాటికి క్లియరెన్స్ ఇస్తారు. కానీ నేను మాత్రం నయా పైసా తీసుకోకుండా నా వద్దకు వచ్చిన ఫైల్స్ క్లియర్ చేస్తుంటాను. 

అరబిందో ఫార్మా కంపెనీ ఫైల్ క్లియరెన్స్ కోసం నా వద్దకు వచ్చినప్పుడు ‘మీరు నాకు పైసలు ఈయాల్సిన అవసరం లేదు కానీ మీ పేరు, నా పేరు శాశ్వితంగా నిలిచిపోయేలా ఏదైనా మంచి పని చేయమని సూచించాను. సామాజిక బాధ్యతగా ఈ జూనియర్ కాలేజి నిర్మించి ఇవ్వాలని కోరాను. వారు అంగీకరించడంతో నేడు ఈ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాము,” అని కొండా సురేఖ అన్నారు. 

కాంగ్రెస్‌ మంత్రులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి 25-30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. మంత్రి కొండా సురేఖ ఆ ఆరోపణలు నిజమే అని ధృవీకరించినట్లయింది. కనుక ఇకపై బిఆర్ఎస్ పార్టీ ఆమె చెప్పిన ఈ మాటలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శిస్తుంటుంది. 

తాను నోరు జారాననే విషయం మంత్రి కొండా సురేఖ గ్రహించగానే, తాను తమ కాంగ్రెస్‌ మంత్రుల గురించి అనలేదని, కేసీఆర్‌ హయంలో మంత్రుల గురించి చెప్పానని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.