నోట్ల రద్దుపై శివసేన కొత్త ట్విస్ట్!

మోడీ ప్రభుత్వం పాత నోట్లని రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే దేశంలో అనేక ప్రతిపక్ష పార్టీలతోబాటు మహారాష్ట్రాలో భాజపాకి మిత్రపక్షంగా, మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న శివసేన కూడా మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు మొన్న రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసి రాష్ట్రపతికి పిర్యాదు చేశారు. వారిలో శివసేన ఎంపిలు కూడా ఉన్నారు.

కానీ నిన్న శివసేన నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీలో లీగల్ సెల్ నేతలు సంజయ్ రౌత్, ఆనందరావు అడ్సుల్, చంద్రకాంత ఖైర్, అరవింద్ సావత్ తదితరులు నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అటువంటి సహసోపేతమైన మంచి నిర్ణయం తీసుకొన్నందుకు అభినందించారు. అయితే నోట్ల రద్దు కారణంగా మహారాష్ట్రాలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు, చిల్లర వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి 13 పేజీల విజ్ఞప్తి పత్రం ప్రధానికి సమర్పించివాటి పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. ప్రతిపక్షాలతో కలిసి తమ ఎంపిలు చేసిన పాదయాత్ర, నిరసనలని పట్టించుకోవద్దని కోరారు. ఇకనుంచి ఈ విషయంలో కేంద్రప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. 

మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన మొదటి నుంచి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో, ముఖ్యంగా భాజపాతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకు కూడా అలాగే ప్రవర్తించింది. కానీ హటాత్తుగా తన వైఖరిని ఎందుకు మార్చుకొందో తెలియదు. బహుశః శివసేన వద్ద కూడా బారీగా నల్లధనం పోగుపడినందునే రాజీకి దిగివచ్చిందా లేక మరేవయిణా రాజకీయ కారణాలున్నాయా అనేది మున్ముందు బయటపడుతుంది. కానీ మొదట నోట్ల రద్దు ని గట్టిగా వ్యతిరేకించి, ఇప్పుడు మాతమర్చినందున అది రాష్ట్రంలో ప్రజలకి ఏవిధంగా సర్దిచెప్పుకొంటుందో చూడాలి.