మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరు చెపితే దానిపై ప్రతిపక్షాలు చేసే రాద్దాంతం, వాటిని ఎదుర్కొంటున్న రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావే టక్కున అందరికీ గుర్తుకు వస్తారు. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు హడావుడి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, వాటి నేతలు కొందరు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల త్రవ్వకాలకి అడ్డుపడుతున్నట్లు మంత్రి హరీష్ రావు దృష్టికి రావడంతో ఆయన సహనం కోల్పోయారు.
మెదక్ జిల్లా నిజాంపేట సబ్ మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవం తరువాత జరిగిన ఒక సభలో హరీష్ రావు మాట్లాడుతూ “మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు రైతులని రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేశాయి..అది కుదరక పోవడంతో కోర్టులకి వెళ్ళాయి. వాటన్నిటినీ ఎదుర్కొని మేము ముందుకు సాగుతుంటే, ఇప్పుడు కాలువల త్రవ్వకుండా అడ్డుపడుతున్నట్లు మాకు తెలిసింది. కాలువ త్రవ్వకం పనులని అడ్డుకొంటే వాళ్ళని అందులోనే పూడ్చిపెట్టేస్తాము తప్ప పనులు నిలిపివేయబోము. రాష్ట్రంలో రైతులందరి పొలాలకి నీళ్ళు అందించాలనే మా ప్రయత్నాలకి ప్రతిపక్షాలు సహకరించకపోయినా పరువాలేదు కానీ అడ్డుకొంటే చూస్తూ ఊరుకోము,” అని తీవ్రంగా హెచ్చరించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో తెరాస సర్కార్ కోర్టులకి తప్పుడు సమాచారం ఇచ్చి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే తాము ఆ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నామని వాదిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమనుకొంటే, గతంలో అవి ఏవిధంగా కోర్టుకి వెళ్ళి తెరాస సర్కార్ ని నిలదీశాయో, ఇప్పుడు అదేవిధంగా కోర్టులకి వెళ్ళి నిలదీయవచ్చు. కానీ కాలువ త్రవ్వకాల పనులకి అడ్డుపడటం సరికాదు. ఆవిధంగా చేసినట్లయితే, కోర్టు ద్వారా ఏమీ చేయలేకనే పనులకి అడ్డుపడుతున్నట్లు అవుతుంది.