గోపన్‌పల్లిలో ఐటి పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు షురూ

దేశ విదేశాలకు చెందిన పలు ఐటి కంపెనీలు హైదరాబాద్‌ నగరంలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి సమీపంలో గోపన్‌పల్లిలో 439 ఎకరాలలో కొత్తగా ఐటి పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. 

ఇప్పటికే శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్‌కు సర్వే నంబర్స్ 127-173, 263-286 మద్య గల ఈ భూముల వివరాలు, వాటి సరిహద్దులను సూచిస్తూ నివేదిక సమర్పించారు. ఇప్పటికే గోపన్‌పల్లి పరిసర ప్రాంతాలలో విప్రో వంటి పలు ఐటి కంపెనీలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సమీపంలోనే అమెరికన్ కౌన్సిలెట్‌ కూడా ఉంది. 

కనుక ఇక్కడ మరో ఐటి పార్క్ ఏర్పాటు చేసినట్లయితే మరిన్ని ఐటి కంపెనీలు వస్తాయి. వాటితో చుట్టుపక్కల ప్రాంతాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఐటి కంపెనీలు పెరిగితే వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి కూడ పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుంది. కనుక త్వరలో సర్వే చేసి ఈ భూములకు సరిహద్దులు నిర్ణయిస్తే ఐటి పార్క్ ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.