త్వరలో పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో ఛార్జీలు?

హైదరాబాద్‌ మెట్రో ఛార్జీలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. మెట్రో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి కంపెనీ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ లేఖ వ్రాసింది. ప్రస్తుతం కనిష్ట ఛార్జీ రూ.10లు ఉండగా గరిష్టంగా రూ.65 ఉంది. కనిష్ట ఛార్జీని రూ.15 గరిష్ట ఛార్జీ రూ.75కి పెంచేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్ అండ్ టి కంపెనీ  ప్రభుత్వానికి లేఖ వ్రాసింది. 

హైదరాబాద్‌ మెట్రోలో అన్ని మార్గాలలో కలుపుకొని రోజుకి సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. టికెట్స్ ద్వారా, మెట్రో మాల్స్ అద్దెల ద్వారా ఎల్ అండ్ టి కంపెనీకి ఏడాదికి రూ.1500 కోట్లు ఆదాయం వస్తుంటే, మెట్రో స్టేషన్లు, రైళ్ళ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, బ్యాంకు రుణాలు వాటిపై వడ్డీలకు కలిపి ఏడాదికి రూ.2,000 కోట్లు వరకు చెల్లిస్తోంది. 

కనుక ఏడాదికి రూ.500 కోట్లు నష్టాలు భరించాల్సి వస్తోంది. కానీ మొత్తం భారాన్ని ప్రయాణికులపై మోపలేదు కనుక రూ.150 కోట్లు ఆదాయం పెంచుకునేందుకు ఈ పెంపు తప్పదని ఎల్ అండ్ టి కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు. తమ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే మెట్రో టికెట్ ఛార్జీలు పెంచుతామని చెప్పారు.