మాజీ సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్లో మూడు పియర్స్ క్రుంగిపోగా, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలు పగుళ్ళు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. కనుక సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఇప్పటికే పీసీ ఘోష్ ఏకసభ్య కమీషన్ విచారణ దాదాపు పూర్తి చేసింది. వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ (ఎన్డీఎస్ఏ) బృందం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని పరిశీలించి ఏప్రిల్ 24న రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది.
దానిలో మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాకులో క్రుంగిపోయిన మూడు పియర్స్ పూర్తిగా తొలగించి కొత్తవి నిర్మించాలని, అన్నారం, సుందిళ్ళతో సహా ఈ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని బ్యారేజీలలో తీవ్రమైన లోపాలున్నాయని, కనుక వాటన్నిటినీ సరిచేయాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొంది.
కనుక ఎన్డీఎస్ఏ నివేధికపై అధ్యయనం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుని ఏవిదంగా కాపాడుకొని ఉపయోగించుకోవచ్చో ప్రభుత్వానికి సిఫార్సులతో కూడిన నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ఓ ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేసింది.
దీనిలో నీటి పారుదల శాఖలో జనరల్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఇంజనీర్-ఇన్-చీఫ్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. వారిచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది.