నేడు ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి రాబోతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కారణాలతో అమరావతిని వద్దనుకొని 5 ఏళ్ళు పాడుబెట్టేశారు. ఇప్పుడు ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతి నిర్మాణ పనులను ప్రధాని మోడీ చేతనే పునః ప్రారంభిస్తున్నారు. 

ఈరోజు మద్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో అమరావతి చేరుకుంటారు. భారత్‌-పాక్ మద్య ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు మరిన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ప్రధాని మోడీ అమరావతిలో ఉన్నంత సేపు ఆ ప్రాంతమంతా ‘నో ఫ్లై జోన్‌’గా ప్రకటించారు. ఆ చుట్టుపక్కల డ్రోన్లు కనీసం బెలూన్లు ఎగురవేయరాదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రధాని మోడీ కోసం ఏపీ ప్రభుత్వం విమానాశ్రయంలో నాలుగు హెలికాఫ్టర్లు సిద్దంగా ఉంచింది. వాటిలో దేనిలో ఆయన ప్రయాణించబోతున్నారనేది చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచుతారు. ఒకవేళ హెలికాఫ్టర్‌లో వద్దనుకుంటే గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతి వరకు రోడ్డు మార్గంలో ప్రధాని మోడీ కాన్వాయ్ ప్రయాణించేందుకు కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

అమరావతిలో ప్రధాని మోడీ పాల్గొనే సభ వేదికకు సమీపంలో 30 మంది వైద్య బృందం, 21 అంబులెన్సులు, గుడారాలలో పది పడకలతో మూడు తాత్కాలిక ఆస్పత్రులు సిద్దంగా ఉంచారు. అత్యవసర పరిస్థితిలో వైద్య చికిత్స అందించేందుకు మంగళగిరిలో ఓ కార్పొరేట్ హాస్పిటల్‌, ఎయిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా వార్డులు కేటాయించి, వైద్య సిబ్బందిని సిద్దంగా ఉంచారు. 

ఈరోజు ప్రధాని మోడీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.57,962 కోట్లు విలువగల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.

ఈ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, కూటమిలో మూడు పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఈ సభకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి సుమారు 3-5 లక్షల ప్రజలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం 5500 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది.