తెదేపా సీనియర్ నేత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై స్పందిస్తూ కేంద్రప్రభుత్వానికి ఒక మంచి సలహా ఇచ్చారు. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే పాత నోట్లని రద్దు చేయడం చాలా పెద్ద పొరపాటని అన్నారు. కానీ జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే, ఈ సమస్యల నుంచి ఏవిధంగా బయటపడాలో ఆలోచించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రులు, ఎంపిక చేసిన కొందరు ముఖ్యమంత్రులతో కూడిన ఒక కమిటినీ వేసి, వారి సలహాల మేరకు నష్టనివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమస్యని అధిగమించేందుకు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లని, ప్రముఖ ఆర్ధికవేత్త మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ వంటి వారి సలహాలు తీసుకొంటే చాలా మంచిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గిపోయాయని, దేశంలో అన్ని రంగాలపై దీని ప్రభావం పడి తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. కనుక వీలైనంత త్వరగా దేశాన్ని ఈ సమస్యల నుంచి కేంద్రప్రభుత్వం గట్టెక్కించక లేకపోతే దేశంలో పెద్ద సంక్షోభం ఏర్పడుతుందని ముద్దు కృష్ణం నాయుడు అన్నారు.
ఒక సమస్య ఎదురైన తరువాత అది కళ్ళకి కనబడుతుంది కనుక ఎవరైనా దాని గురించి విమర్శలు చేయగలరు. కానీ దానిని ముందుగా ఊహించగలవారు అతి కొద్ది మందే ఉంటారు. నోట్ల రద్దు తదనంతర పరిణామాల వలన ఇప్పుడు అదే జరుగుతోంది. “ముందుగానే దేశానికి అవసరమైనన్ని రూ.100, 500 నోట్లని ముద్రించి బ్యాంకులలో డంప్ చేసి ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు,” అని ముద్దు కృష్ణం నాయుడు చెపుతున్న మాటలు అలాగే ఉన్నాయి.
ఇప్పుడు సమస్య ఏమిటో కళ్ళకి కనబడుతోంది కనుక అందరూ రకరకాల సలహాలు ఇవ్వగలరు. ఈ పరిస్థితులలో అదీ మంచిదేనని చెప్పవచ్చు. గాలి చెప్పినట్లుగా దేశంలో ఆర్ధిక, బ్యాంకింగ్ రంగం నిపుణులకి కొదవ లేదు. కనుక వారి సలహాలతో కేంద్రప్రభుత్వం ఈ సమస్యని అధిగమించే ప్రయత్నం చేయడం మంచిదే.