మొన్న హనుమకొండలో జరిగిన బిఆర్ఎస్ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “శాసనసభలో మా పిల్లగాళ్ళకే కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు,” అని అనడంపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “వారింకా పిలగాళ్ళేనా? అయితే కేసీఆర్ శాసనసభకు రాకుండా వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు?” అని ప్రశ్నించారు.
తాను బిఆర్ఎస్ పార్టీని ఓడించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడే కేసీఆర్ గుండె పగిలిందని అందుకే శాసనసభకు రాకుండా మొహం చాటేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. కేసీఆర్ ప్రసంగంలో బెదిరింపులు, ఆత్మస్తుతితో ఆయన అభద్రతాభావం బయటపెట్టుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వరుసగా ఎన్నికల హామీలు అమలు చేస్తుండటం వలన తమ పార్టీకి, ప్రభుత్వానికి నానాటికీ ప్రజాధరణ పెరుగుతుండటం చూసి ఓర్వలేకనే మేము ఏమీ చేయడంలేదంటూ బిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, కేసీఆర్ ప్రసంగంలో కూడా అదే కనబడిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలలోకి తీసుకువెళ్ళడంలో అలసత్వం ప్రదర్శిస్తుండటం వలననే బిఆర్ఎస్ పార్టీకి ఈ అవకాశం లభిస్తోందని అన్నారు. కనుక ఇకనైనా హైదరాబాద్‌లో తిష్టవేసుకొని కూర్చొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేయాలని లేకుంటే భవిష్యత్ ఉండదని గుర్తుంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవుల గురించి అనవసరమైన విషయాలు మాట్లాడుతూ హద్దులు దాటుతున్నారని, ఇకనైనా అందరూ క్రమశిక్షణతో మెలిగితే మంచిదని లేకుంటే ఎంత మాత్రం సహించబోనని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తాను మరో 20 ఏళ్ళు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటానని, ఎట్టి పరిస్థితులలో మళ్ళీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానీయనని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.