తెలంగాణ పోలీసులకు కేసీఆర్‌ వార్నింగ్

హనుమకొండలో ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌, బీజేపిలపై నిప్పులు చెరిగారు. 

తెలంగాణ సాధన కోసం పార్టీని స్థాపించినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండేదో, ఒంటరిగా తన ప్రయాణం ఏవిదంగా మొదలుపెటి అవమానాలు భరిస్తూ అందరినీ కూడగట్టుకొని ముందుకు సాగి తెలంగాణ సాధించానన్నారు. 

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకే సాగు త్రాగు నీరు అందించాలని కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వాటితో సహా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో పూర్తిగా భ్రష్టు పట్టించేశారన్నారు. 

సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు.  రేవంత్ రెడ్డి, మంత్రులు తమకు 25-30 శాతం కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారన్నారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ పోలీసులకు కూడా చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఈ సభ పెట్టుకోవడానికి  అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మంత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తూ భవిష్యత్‌లో చిక్కులో పడవద్దని కేసీఆర్‌ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అందరూ గుర్తుంచుకొని పద్దతిగా పనిచేసుకోవాలని లేకుంటే పర్యవసానాలు భరించక తప్పదని కేసీఆర్‌ పోలీసులను హెచ్చరించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రధాని మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ కగార్ అంటూ మావోయిస్టులని ఊచకోత కోస్తున్నారు. ఇదెక్కడి పద్దతి? వారిని పిలిచి మాట్లాడి నచ్చజెప్పాలి కానీ చంపేస్తాం.. కాల్చేస్తాం అంటూ భద్రతా దళాలని పంపించడం చాలా దారుణం. మీ అందరి ఆమోదంతో ఈ నరమేధం ఆపమని నేను ప్రధాని మోడీకి లేఖ వ్రాస్తానన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మనకి లేదు. వాళ్ళు ఎలాగూ సమర్ధంగా పనిచేయలేక చేతులెత్తేస్తున్నారు. కనుక ప్రజలే వారి వీపులు వాయగొట్టి గద్దె దించుతారని, అంత వరకు మనం ఓపిక పట్టాలని  కేసీఆర్‌ అన్నారు.