ఎక్కడ చూసినా గులాబీ జెండాలే.. రేపే బిఆర్ఎస్ రజతోత్సవ సభ!

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి వద్ద రేపు (ఏప్రిల్ 27) నిర్వహించబోతోంది. సుమారు 7-8 లక్షల మందితో దీనిని అట్టహాసంగా ఈ సభ నిర్వహించి, బిఆర్ఎస్ పార్టీ చెక్కు చెదరలేదని నేటికీ చాలా బలంగా ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

తెలంగాణలో అత్యంత విశ్వసనీయమైన పార్టీ బిఆర్ఎస్ మాత్రమే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభతో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించి వారికి చేరువయ్యేందుకు శ్రమిస్తున్నారు. 

ఈ ఒక్క సభతోనే తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు మొదలవుతాయని, అవి బిఆర్ఎస్ పార్టీకి మేలు చేస్తాయని ఆ పార్టీ నేతలు ఆశపడుతున్నారు.

కనుక 1200 ఎకరాలలో నిర్వహించబోయే ఈ సభ కోసం భారీగా ఖర్చుపెట్టడానికి కేసీఆర్‌ వెనకాడటం లేదు. కనుక జనసమీకరణ, స్వాగత తోరణాలు, కటవుట్లు, పోస్టర్లు, గులాబీ జండాలు, బ్యానర్లు, సోషల్ మీడియాలో ప్రచారం అన్నీ కూడా చాలా భారీగానే ఉన్నాయి.  

తెలంగాణ అంతటా తీవ్రమైన ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత్తలు, వడగాడ్పులతో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతుంటే, బిఆర్ఎస్ పార్టీ నేతలు వారిని తమ గులాబీ సభకు రప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సభని విజయవంతం చేయడం జీవన్మరణ సమస్య అన్నట్లు రేయింబవళ్ళు శ్రమిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు.  

బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టి కృషికి సత్ఫలితాలు కనబడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా గులాబీ జండాలే. గులాబీ సభ గురించి చర్చలే జోరుగా సాగుతున్నాయి. ఈ ఒక్క సభతో కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను బ్రేక్ చేయగలరా లేదా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.