అతను తెరాస నేత కాదు: కేటిఆర్

సూర్యాపేట జిల్లాకి చెందిన సంతోష్ అనే వ్యక్తి తాను మంత్రి జగదీశ్ రెడ్డికి అనుచరుడినని చెప్పుకొంటూ నిరుద్యోగులని మోసం చేస్తున్న సంఘటన ఒకటి బయటకి వచ్చింది. తను తెరాస పార్టీ నేతనని, తనకు ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉందని చెప్పుకొంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల రూపాయలు పిండుకొన్నాడు. కానీ ఎన్ని రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో ఇద్దరు యువకులు తమ డబ్బు తమకి వాపసు ఇమ్మని కోరితే వారిని సంతోష్ బండబూతులు తిట్టడమే కాకుండా తన వంటి పెద్ద నేతని డబ్బులు వాపసు ఇమ్మని అడుగుతారా? అంటూ కాలితో వారి గుండెలపై తన్నాడు. వారిద్దరినీ తన కార్యాలయంలో గొడ్డుని బాదినట్లు బాదాడు.

దానిని ఒక జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది మంత్రి జగదీశ్ రెడ్డి చెవిన పడింది. తనకు అటువంటి పేరుగల అనుచరుడు ఎవరూ లేరని ఆయన తెలిపారు. ఈ విషయం మంత్రి కేటిఆర్ దృష్టికి కూడా వెళ్ళడంతో ఆయన చాల సీరియస్ అయ్యారు. సదరు వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర డిజిపిని కోరారు. ఈవిధంగా తెరాస పార్టీ పేరు చెప్పుకొని నిరుద్యోగులని మోసం చేస్తున్న వారిపై కటిన చర్యలు తీసుకోవాలని కోరారు. అతను తెరాస సభ్యుడు కాడని స్పష్టం చేశారు.

అతను మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడని ఆ తరువాత ఆమాద్మీ పార్టీలో చేరాడని కానీ ఆ పార్టీకి రాష్ట్రంలో తగిన గుర్తింపు లేకపోవడంతో తెరాస నేతనని చెప్పుకొంటూ నిరుద్యోగులని మోసం చేస్తున్నాడని ఒక తెరాస నేత చెప్పారు.