“మనం నిత్య జీవితంలో ఏదో ఒక క్యూ లైన్ లో నిలబడుతూనే ఉంటాము. ఒకసారి బస్సుల కోసం, మరొకసారి సినిమా టికెట్స్ కోసం, మరోసారి రేషన్ షాపులోనో...ప్రభుత్వం కార్యాలయాలలోనో క్యూ లైన్లలో నిలబడుతూనే ఉంటాము. అప్పుడు కాస్త ఇబ్బందిపడుతున్నా ఓపికగా నించొంటాము కానీ దేశహితం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నప్పుడు కొన్నిసార్లు ఎటిఎం వద్ద క్యూ లైన్లో నిలబడలేమా?” అని ప్రశ్నించారు ప్రముఖ మలయాళ సినీ నటుడు మోహన్ లాల్.
ఆయన నోట్ల రద్దు నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ అభిమానించనని కానీ వారు చేసే మంచి పనులకి మద్దతు ఇస్తానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఒక మంచి ఉద్దేశ్యంతో తీసుకొన్నారని దానిని తాను స్వాగతిస్తున్నాని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి తను పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఇంత సాహసోపేతమైన మంచి నిర్ణయం తీసుకొన్నందుకు మోడీకి సెల్యూట్ చేస్తున్నానని మోహన్ లాల్ తన బ్లాగ్ లో వ్రాశారు.
దేశంలో ఇంకా చాలా మంది నటులు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు తప్ప మిగిలిన వారెవరూ ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడలేదు.
ఈ నోట్ల రద్దు కారణంగా మోడీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. బ్యాంకులు, ఎటిఎంలలో సరిపడినన్ని నోట్ల సరఫరా చేయగలిగే వరకూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు, ఒత్తిళ్ళు తప్పవు. కనుక యుద్ద ప్రాతిపదికన ఆ ఏర్పాట్లు చేస్తూనే మరో పక్క ఈవిధంగా దేశంలో సినీ, వాణిజ్య, ఐటి, తదితర రంగాలకి చెందిన ప్రముఖుల చేత నోట్ల రద్దు వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకి వివరింపజేసి వారి ద్వారానే మోడీ ప్రభుత్వం ప్రజల మద్దతు కూడా గట్టుకోగలిగితే, నోట్ల రద్దుని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలని సులువుగా ఎదుర్కోగలదు.