తెలుగు సినీ నటుడు నాగబాబు మొన్న మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ వాక్ స్వాతంత్రం ఉందని, అందుకే ఎంతటివారినైనా నోటికి వచ్చినట్లు అందరూ విమర్శించగలుగుతున్నారని అన్నారు. అది నిజమేనని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిపిఐ నేత కె.నారాయణ నిరూపించారు.
అరవింద్ కేజ్రీవాల్ తాజా ట్వీట్ లో ‘దేశంలో నోట్లుని కాదు ప్రధాని నరేంద్ర మోడీని మార్చాలి,’ అని మెసేజ్ పెట్టారు. నోటి దురద చాలా ఎక్కువగా ఉండే నారాయణ మరి కాస్త రెచ్చిపోయి ప్రధాని నరేంద్ర మోడీని నడిరోడ్డు మీద ఉరి తీయాలని అన్నారు. నిరుపేదలు కష్టపడి దాచుకొన్న డబ్బుకి విలువ లేకుండా చేసిన మోడీ ఒక శాడిస్ట్ అని ఆయన ప్రభుత్వం ఒక శాడిస్ట్ ప్రభుత్వమని నారాయణ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తున్న నోట్లకి ఆ విలువ ఉంటుందని ఆ బ్యాంక్ గవర్నర్ ప్రతీ నోటుపై సంతకం చేసి హామీ ఇచ్చినవి చెల్లవని మోడీ చెప్పడానికి ఆయన అధికారమే లేదని అన్నారు.
ఈ నోట్ల రద్దు కారణంగా దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోట్లాది ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని తిట్టుకొంటూ ఉండవచ్చు. కానీ అంతే మంది ఆయన నిర్ణయాన్ని మెచ్చుకొంటున్నారు కూడా. ఈ నిర్ణయం అమలు కంటే, దాని తదనంతర పరిస్థితులని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేకపోవడం వలననే అందరూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని వేలెత్తి చూపగలుగుతున్నారు. అదే ఈ సమస్యలేవీ లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి ఉండి ఉంటే నేడు నారాయణ, అరవింద్ కేజ్రీవాల్ వంటివారు ప్రధాని నరేంద్ర మోడీని ఈవిధంగా విమర్శించి ఉండగలిగేవారా?