ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

పార్టీ ఫిరాయించిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. 

ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి “ఆ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయరు. ఉప ఎన్నికలు జరుగవంటూ” చేసిన వ్యాఖ్యలని పిటిషనర్ తరపు న్యాయవాది ఈ కేసుపై విచారణ జరుపుతున్న జస్టిస్ బీఆర్ గవాయ్ దృష్టికి తీసుకువెళ్ళగా, ముఖ్యమంత్రి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్న కేసుపై ఈవిదంగా మాట్లాడటం తగదు. వాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించకపోవడం మా అసహాయతగా భావించకూడదు. ఇటువంటి సందర్భాలలో సంయమనం పాటించడం చాలా అవసరం.

న్యాయవ్యవస్థలు ఏవిదంగా శాసనసభ, లోక్‌సభ వంటి రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తుందో అవి కూడా అలాగే న్యాయ వ్యవస్థని గౌరవించాలని ఆశిస్తున్నాము,”  అని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.