
వక్ఫ్ బిల్లుకి లోక్సభ ఆమోదముద్ర వేసింది. బుధవారం మద్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజామున 2.15 గంటల వరకు లోక్సభలో ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మద్య చాలా వాడివేడిగా వాదోపవాదాలు సాగాయి.
అనంతరం ఈరోజు తెల్లవారు జామున ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓట్లు వేయడంతో 56 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందిన్నట్లు లోక్సభ స్పీకర్ ప్రకటించారు.
ఎన్డీఏ మిత్రపక్షలైన టీడీపీ, జనసేనతో సహా జేడీ(యు), శివసేన (షిండే) కూడా మద్దతు ఇవ్వగా, కాంగ్రెస్ మిత్ర పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్, బిఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి.
లోక్సభలో ఈ బిల్లుకి ఆమోదం లభించినందున నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో కూడా ఎన్డీఏకి తగినంత బలం ఉంది కనుక ఈ బిల్లుని ఆమోదింపజేసుకోగలదు. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం లాంఛనప్రాయమే. కనుక త్వరలోనే ఈ వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణలు అమలులోకి రానున్నాయి.