హెచ్‌సీయూ: రేపటి వరకు హైకోర్టు స్టే

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలలో జంగిల్ క్లియరెన్స్ పనులను హెచ్‌సీయూ విద్యార్ధులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు, విద్యార్ధులు అభ్యంతరం చెపుతున్నప్పటికీ ప్రభుత్వం ముందుకే సాగుతుండటంతో ‘వట ఫౌండేషన్’, హెచ్‌సీయూ విద్యార్ధుల తరపున హైకోర్టులో నేడు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 

పిటిషనర్స్ తరపు న్యాయవాదులు నిరంజన్, రవి చంద్ వాదిస్తూ అది ప్రభుత్వ భూమే అయినప్పటికీ పర్యావరణానికి నష్టం కలిగించకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా డజన్ల కొద్దీ జేసీబీలతో చెట్లని కూల ద్రోస్తున్నారని, ఆ ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద చెరువులు, అనేక వన్య ప్రాణులు ఉన్నాయని హైకోర్టు దృష్టికి తెచ్చారు. 

ఈ పర్యావరణ విధ్వంసం వలన నగరంలో పచ్చదనం కూడా తగ్గిపోతుందని వాదించారు. కనుక అటవీ ప్రాంతంలో చెట్లని నరకాలంటే ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కానీ తెలంగాణ ప్రభుత్వం అటువంటిదేమీ తీసుకోకుండా పర్యావరణ విధ్వంసానికి పూనుకుందని కనుక దీని కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో: 54ని తక్షణం రద్దు చేయాలని పిటిషనర్స్ తరపు న్యాయవాదులు హైకోర్టుని అభ్యర్ధించారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రేపటి వరకు అక్కడ చెట్లు నరకవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణని రేపటికి వాయిదా వేశారు.