
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న శ్రవణ్ రావు బుధవారం ఉదయం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాలని షరతు విధించడంతో మార్చి 29 న అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చి తొలిసారిగా విచారణకు హాజరయ్యారు. కానీ విచారణలో పోలీసులకు సహకరించకపోవడంతో మళ్ళీ నోటీస్ పంపించి నేడు మరోసారి విచారిస్తున్నారు.
ఈ కేసులో ఆయన కీలకపాత్ర వహించారు కనుక ఆయనకు చాలా విషయాలు తెలుసని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయన విచారణలో నోరు విప్పి నిజాలు బయటపెడితే కేసు విచారణ మలుపు తిరుగుతుంది. వేగం పుంజుకుంటుంది. కనుక పోలీసులు ఆయన నోరు తెరిపించి ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులు, పాత్రధారుల పేర్లు, ప్రమేయం కనుగొనగలరా లేదా అనేది త్వరలో తెలిపోతుంది.
ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న స్పెషల్ ఇంటలిజన్స్ బ్యూరో మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు అమెరికా పారిపోయి అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. ఆయన అరెస్ట్ కోసం సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. కనుక ఆయనని కూడా తిరిగి రప్పిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వస్తుంది.