ఏప్రిల్ 27న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రజతోత్సవ సభని మొదట వరంగల్ జిల్లా దేవన్నపేటలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి వద్ద జరపాలని నిర్ణయించారు.
ఈ సభ కోసం స్థానిక రైతుల నుంచి 1200 ఎకరాలు తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు శనివారం ఉదయం కాజీపేట ఏసీపీ తిరుమల్ని కలిసి సభకు అనుమతి కోరారు. సభకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు.
ఇది బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కనుక కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు లక్షమందికి పైగా జనం వస్తారని ఆశిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోయింది. వడగాడ్పులు వీస్తున్నాయి. కనుక లక్షమందికి కూర్చొనేందుకు వీలుగా విశాలమైన షామియానాలు వేసి, ఎక్కడికక్కడ కూలర్లు, చల్లటి మంచి నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
10 లక్షల వాటర్ ప్యాకెట్స్, మరో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్స్ ఏర్పాటు చేస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు. ఇక ఈ సభకు సుమారు 40-50,000 వాహనాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక అందుకు తగ్గట్లుగా సభా ప్రాంగణానికి వీలైనంత సమీపంలో వంద ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.
ఇంతమంది జనం, ఇన్ని వాహనాలు వచ్చినప్పుడు పోలీసులు సరిపోరు. కనుక బిఆర్ఎస్ పార్టీ తరపున 10-12,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ సభ నిర్వహణ కొరకు మొత్తం 20 కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.