మంత్రి సీతక్క చురకలు మామూలుగా లేవు!

ఈరోజు శాసనమండలిలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందిస్తూ చురకలు వేశారు. వాటిని ఆమె కూడా కాదనలేని విదంగా ఉన్నాయవి. సీతక్క ఏమన్నారంటే, “కేసీఆర్‌, మీరు, మీ పార్టీ నేతలు కలిసి తెలంగాణ పరువు తీస్తే దానిని కాపాడేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు. పదవులు, అధికారం అన్నీ మీ కుటుంబం గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యం చేశారు.

మహిళల గురించి కల్వకుంట్ల కవిత గొప్పగా చెపుతున్నారు. కానీ మొదటి 5 సంవత్సరాలలో కేసీఆర్‌ క్యాబినెట్‌లో ఒక్క మహిళని కూడా తీసుకోలేదు. రాష్ట్రంలో మహిళలు కష్టపడి సంపాదించుకొని జమ చేసుకున్న రూ.1,800 కోట్లు కూడా మీ ప్రభుత్వం తీసి వాడేసుకుంది. మహిళలకు పావలా వడ్డీతో అప్పులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే ఎగ్గొట్టి వెళ్ళిపోయారు.

మేమే కాల్వలు కట్టాము.. నీళ్ళు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు కట్టిన కాలువలను ఎవరైనా మూసేశారా?మూయకపోతే మరి నీళ్ళు ఎందుకు రావడం లేదు? మీరే చెప్పాలి,” అంటూ మంత్రి సీతక్క సున్నితంగా కల్వకుంట్ల కవితకి చురకలు వేశారు.