వచ్చే నెల 27న వరంగల్ జిల్లా దేవన్నపేటలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభ జరుగబోతోంది. ఈ సభ ఏర్పాట్లలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సూర్యాపేటలో సన్నాహక సభ నిర్వహించి సభకు చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందే తప్ప ప్రజల నమ్మకం కాదు. 15 నెలల కాంగ్రెస్ పాలనతో వేసారిపోయిన ప్రజలు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలొస్తాయా బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుని అధికారంలోకి తెచ్చుకుందామా? అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కనుక ఎన్నికలు ఎప్పుడొచ్చినా బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభని విజయవంతం చేయడమే మన తక్షణ కర్తవ్యం. ఆ సభని విజయవంతం చేసి మన పోరాట స్పూర్తిని చాటుదాం.
నేను వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలను, కార్యకర్తలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకుంటాను. కేసీఆర్ మీద కక్షతోనే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండబెట్టేసి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నాడు.
రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెరిపేస్తే కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీ ప్రజలు మారిచిపోతారనుకోవడం ఆవివేకమే. తెలంగాణ చరిత్రలో, ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్‌ని ఎవరైనా చెరపగలరా?” అని కేటీఆర్ అన్నారు.