వైటీడీ ఉండగా టీటీడీ ఎందుకు? సిఎం రేవంత్

ఇటీవల బీజేపి ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ, “శ్రీవారి బ్రేక్ దర్శనాల విషయంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవడం లేదు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశించినా టీటీడీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇకనైనా టీటీడీ తెలంగాణ ప్రముఖుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాను. లేకుంటే ఈసారి తెలంగాణ ఎమ్మెల్యేలందరం కలిసి వచ్చి టీటీడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాము,” అని హెచ్చరించారు. 

టీటీడీ తీరుపై సిఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “తిరుమల స్వామివారి దర్శనం కల్పించామని ప్రతీసారి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీని వేడుకోవలసిన అవసరం మనకేమిటి? వాళ్ళకి తిరుమల-టీటీడీ ఉంటే మనకి యాదగిరిగుట్ట- వైటీడీ ఉందిగా. తెలంగాణలో భద్రాచలం, వేములవాడ వంటి అనేక ప్రసిద్ద ఆలయాలున్నాయి కదా? తిరుమలకు వెళ్ళి టీటీడీని బ్రతిమాలుకునే బదులు రాచ మర్యాదలతో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాలను సందర్శించుకోవచ్చు కదా? తద్వారా మన దేవాలయాలకు మనం  ప్రాధాన్యం ఇచ్చిన్నట్లు అవుతుంది కదా?” అని అన్నారు.