యూకె పార్లమెంటులో చిరంజీవికి సన్మానం బయట తలనొప్పులు!

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. యూకె హౌస్ ఆఫ్ కామన్స్ (పార్లమెంటు)లో సభ్యులు ఆయనకు ఘనంగా సన్మానించి లైఫ్ టైమ్ అచీమెంట్ పురస్కారంతో గౌరవించారు. అయితే ఆయనకు బయట అభిమానులతో ఊహించని తలనొప్పులు వచ్చాయి. 

ఈ పురస్కారం అందుకునేందుకు ఆయన లండన్ వచ్చినప్పుడు ఆయనతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కొందరు అభిమానులు లేదా ఆ పేరుతో కొందరు వ్యక్తులు చందాలు వసూలు చేశారు. ఈ విషయం తెలిసి చిరంజీవి చాలా అసహనానికి గురయ్యారు. 

దీనిపై  స్పందిస్తూ, “నా ప్రియమైన అభిమానులూ, మీ ప్రేమాభిమానాలు, నన్ను కలవాలనే మీ కోరిక నా హృదయాన్ని తాకింది. అయితే కొంతమంది వ్యక్తులు నాతో మీకు సమావేశం ఏర్పాటు చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఇటువంటి పనులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరి వద్ద నుంచి ఎవరైనా చందాలు వసూలు చేసినట్లయితే తక్షణం వారికి తిరిగి ఇచ్చేయమని కోరుతున్నాను. 

నేను ఇటువంటివాటిని ప్రోత్సహించనని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. మన మద్య ఉన్న ప్రేమానుబంధాలు చాలా అమూల్యమైనవి. వాటితో ఈవిదంగా వ్యాపారం చేయాలని ఎవరు ప్రయత్నించినా నేను సమర్ధించను. దయచేసి మన మద్య బంధాలను స్వచ్ఛంగా కొనసాగిద్దాము. ఇటువంటి వాటికి దూరంగా ఉందాము,” అని చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.