ఘోషా మహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తుండటంతో మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆయనకు బుధవారం ఓ లేఖ పంపారు. దానిలో రాజాసింగ్‌ని మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బెదిరింపు కాల్స్ వస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది లేకుండానే ప్రజల మద్య బహిరంగం తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది చాలా ప్రమాదకరమని కనుక ఆయన రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, 1+4 భద్రతా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ, “ఘోషామహల్ చిన్న చిన్న గల్లీలలో నేను బుల్లెట్ ప్రూఫ్ వాహనం వేసుకొని తిరగడం సాధ్యం కాదు. నగరంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు తప్పకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణిస్తాను.
నా భద్రత కోసం రివాల్వర్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకొని చాలా రోజులే అయ్యింది. కనీసం ఇప్పటికైనా ఆ దరఖాస్తుని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.