తెలంగాణ వార్షిక బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు?

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క మరికొద్ది సేపటిలో శాసనసభలో 2025-26 సంవత్సరాలకు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. ముందుగా ఆనవాయితీ ప్రకారం మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కి ఆమోదముద్ర వేస్తారు. 

రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ.2.75-3 లక్షల కోట్ల మద్య ఉండవచ్చని సమాచారం. బడ్జెట్‌ ప్రవేశ పెట్టకమునుపే ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదని నెలసరి ఆదాయంలో సగానికి పైగా అప్పులు, వడ్డీలు, జీతాలకే సరిపోతోందని చెప్పారు. మిగిలిన రూ.5,500 కోట్లతోనే అన్నిటికీ సర్దుతున్నామని చెప్పారు. 

కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. కనుక రాష్ట్ర బడ్జెట్‌ ఏవిదంగా ఉంటుందో, ఏ శాఖ, రంగం, పధకాలకు ఎంత కేటాయిస్తారో మరికొద్ది సేపటిలో స్పష్టమవుతుంది. 

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు, వడ్డీలు, ఎన్నికల హామీలు మెడకు ఉచ్చులా బిగుసుకు ఉన్నాయని చెప్పొచ్చు. వీటన్నిటికీ నిధులు కేటాయిస్తే సరిపోదు.

పలు ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం తక్కువ, అప్పులు, ఖర్చులు ఎక్కువగా ఉన్నందున ఒకవేళ బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసినా వాటిని ఏవిదంగా సమకూర్చుకుంటుందనేది ప్రశ్నార్ధకమే.