తీన్‌మార్ మల్లన్నకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ?

సమగ్ర కుల గణన ప్రతులని తగులబెట్టి, రిజర్వేషన్స్ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసినందుకు ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యారు.

ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌, సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ మరీ సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ప్రెస్‌మీట్‌కి బిఆర్ఎస్ పార్టీ తరపున అవసరమైన సహాయసహకారాలు లభించాయని గుసగుసలు వినిపించాయి. వాటిని ధృవీకరిస్తున్నట్లుగా శాసనసభలో పార్టీ కార్యాలయంలోనే ఆయన కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమయ్యారు. 

ఒకప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌, బిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని తీన్‌మార్ మల్లన్న చాలా తీవ్రంగా విమర్శించేవారు. అనేకఅనేక అవినీతి ఆరోపణలు చేసేవారు. కనుక కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఆయన యూట్యూబ్‌ ఛానల్ కార్యాలయంపై పోలీసులతో దాడులు జరిపించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నందుకు కేసు నమోదు చేసి జైలుకి కూడా పంపించారు. 

తీన్‌మార్ మల్లన్న-బిఆర్ఎస్ పార్టీ ఒకరిని మరొకరు తీవ్రంగా ద్వేషించుకుంటునందున  వారు కలిసే అవకాశం లేదనే భావించవచ్చు. కానీ శాసనసభలోనే తీన్‌మార్ మల్లన్న, బిఆర్ఎస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. 

వారిద్దరికీ ఉమ్మడి శత్రువు సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వమే. కనుక వారు తమ విభేధాలు పక్కన పెట్టిన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఓ పక్క నిన్న శాసనసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం  బిల్లు పెట్టగా దానికి బిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడింది. కానీ బీసీ రిజర్వేషన్స్ గురించితీన్‌మార్ మల్లన్న పోరాడాలనుకోవడం గమనిస్తే ఆయన బీసీ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతున్నట్లు అర్దమవుతోంది.

శాసనసభలో బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతు ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నేతలు తీన్‌మార్ మల్లన్నతో ఎందుకు సమావేశమైనట్లు? అంటే రాజకీయ అవసరం లేదా ప్రయోజనాల కోసమే అని అనుమానించక తప్పదు.