కేంద్రప్రభుత్వం తీసుకొన్న నోట్ల రద్దు నిర్ణయం వలన దేశంలో సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా ఇతరత్రా సమస్యలు, కారణాల చేత ఆ నిర్ణయంపై స్టే విదించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా అనేక హైకోర్టులలో, సుప్రీంకోర్టులో కూడా అనేక పిటిషన్లు దాఖలయాయి. హైకోర్టులలో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టకుండా స్టే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ సుప్రీంకోర్టుకి చేసిన విజ్ఞప్తిని త్రోసిపుచ్చింది. కానీ వివిధ హైకోర్టులలో దాఖలైన అన్ని పిటిషన్లని కలిపి ఒకేసారి నవంబర్ 23న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దాని కోసం సుప్రీంకోర్టు సూచన మేరకు అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ మళ్ళీ వేరేగా మరొక పిటిషన్ దాఖలు చేశారు.
నోట్ల రద్దు నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన వైఖరిని ఇంతకు ముందే స్పష్టం చేసింది. అది సరైన నిర్ణయమే కానీ దాని తదనంతర పరిణామాలని ఎదుర్కోవడంలో కేంద్రప్రభుత్వం విఫలం అయినట్లు భావిస్తున్నామని చెప్పింది. కనుక నవంబర్ 23న జరిగే విచారణలో కూడా సుప్రీంకోర్టు వైఖరిలో మార్పు ఉండకపోవచ్చు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించినట్లయితే, ఈ కారణంగా చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించమని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. ఈ నోట్ల కష్టాలని అధిగమించడానికి అవసరమైన సలహా లేదా సూచన చేయవచ్చు. ఈలోగా కేంద్రప్రభుత్వం ఈ సమస్యలని కొంతవరకైనా పరిష్కరించగలిగితే ఇక ఇబ్బందే ఉండదు.